శని ప్రభావం పోగొట్టుకోవటం ఏలా, ఏ పరిహారాలు చేయాలి
గ్రహాలన్నింటిలో మనిషికి ఎక్కువగా భయపెట్టే గ్రహం శని. శని పాప గ్రహం అవటం, మనిషి కష్టాలకు కారణం అవటం, గోచారంలో మిగతా అన్ని గ్రహాలకంటే నెమ్మదిగా సంచరించటం తద్వారా మనిషి జీవితం పై ఎక్కువ ప్రభావం చూపించటం ఈ భయానికి కారణాలు. ఏల్నాటి శని వస్తోంది అంటే చాలా మందికి ఒకలాంటి భయం మొదలవుతుంది. ఎటువంటి సమస్యలు వస్తాయో, వాటిని ఎలా ఎదుర్కొనాలో అని చాలామంది ఆందోళనకు గురి అవుతారు.
గోచార రీత్యా శని మన రాశి నుంచి 12, 1 మరియు రెండవ స్థానాల్లో సంచారం చేసినప్పుడు దాన్ని ఏల్నాటి శని అని పిలుస్తారు. అలాగే శని 4వ ఇంట్లో సంచరించినప్పుడు దాన్ని అర్దాష్టమ శనిగా, 8వ ఇంట్లో సంచరించినప్పుడు అష్టమ శని గా చెప్పబడుతుంది. ప్రధానంగా ఈ 5 భావాల్లో శని సంచారం అంతగా అనుకూలించదు.
శని ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. శని పన్నెండవ ఇంటిలో సంచరించినప్పుడు ఆర్ధిక సమస్యలు పెరగటం, నష్టాలు రావటం, విదేశాలకు వెళ్లి అక్కడ కష్టాల పాలు అవటం, ఇంటికి దూరం అవటం, శత్రుభయం పెరగటం మొదలైన సమస్యలు ఉంటాయి. శని ఒకటవ ఇంటిలో ఉన్నప్పుడు గౌరవ భంగం, అనారోగ్యం, సౌఖ్య లేమి, వృత్తిలో సమస్యలు మొదలైన ఫలితాలు ఉంటాయి.
శని రెండవ ఇంటిలో సంచరిస్తున్నప్పుడు కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యులకు అనారోగ్యం తద్వారా ఖర్చులు పెరగటం, ఆదాయం తగ్గటం, మన మాటకు విలువ లేకపోవటం మొదలైన ఫలితాలు ఉంటాయి.
శని నాలుగవ ఇంటిలో సంచరించేటప్పుడు సౌఖ్య లేమి, వాహన సంబంధ ప్రమాదాలు, ఇంటికి దూరం అవటం, వృత్తిలో సమస్యలు మొదలైన ఫలితాలు ఉంటాయి.
శని 8వ ఇంట్లో సంచరించే సమయంలో అనుకోని ప్రమాదాలు జరగటం, మానసికంగా అశాంతికి గురి అవటం, వృత్తిలో ఆకస్మిక మార్పులు, అవమానాలు, వైవాహిక జీవితంలో సమస్యలు, చెడు అలవాట్లకు బానిస అవటం మొదలైన ఫలితాలు ఉంటాయి.
నిజానికి శని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. శని మన కర్మ ఫలితాన్ని తొలగించే గ్రహం. శని కారణంగా వచ్చే ప్రతి సమస్య భవిష్యత్తులో మంచి జరగటానికే ఉపయోగపడుతుంది తప్ప చెడు చేయదు. ఒక ఉపాధ్యాయుడు మాట వినని విద్యార్థిని శిక్షించి అయినా సరే, సరైన మార్గంలో పెట్టాలి అనుకుంటాడు. శని ఇచ్చే ప్రభావం కూడా అలాగే ఉంటుంది. ఎన్నో మానసిక లోపాలతో ఉండే మనం, మన జీవితాన్ని ప్రలోభాలకు లోనయ్యి మనకు చెడు చేసే వాటివైపు వెళతాము. అలాంటి వారికి శని ప్రభావం కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా, క్రమశిక్షణతో జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకునే వారిపై శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. శని తన గోచారంలో ఇచ్చే ఏ ఫలితమైనా మనకు మంచి భవిష్యత్తును ఇవ్వటానికే అని గుర్తుపెట్టుకొండి.
శని ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవటానికి శివ ఆరాధన, హనుమాన్ ఆరాధన లేదా వెంకటేశ్వర ఆరాధన చేయటం మంచిది. అలాగే శని మంత్ర జపం చేయటం, శనికి తైలాభిషేకం చేయటం, ఆరోగ్య సమస్యలు ఉంటే త్రయంబక మంత్రం జపం చేయటం వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. దైవ ఆరాధనతో పాటుగా శని ప్రభావం తగ్గటానికి శారీరక శ్రమ చేయటం, సేవ చేయటం (ముఖ్యంగా వృద్దులకు, వికలాంగులకు), అన్నదానం చేయటం చాల మంచిది. దీని వలన శని ప్రభావం తగ్గటమే కాకుండా ఎన్నో శుభ ఫలితాలు ఏర్పడతాయి.