చంద్రగ్రహణం
చంద్రగ్రహణం - సమయం, ఏ రాశి వారికి ఏ ఫలితం ఉంటుంది.
చంద్రగ్రహణం రోజున ఏ రాశి వారు ఏ నియమాలు పాటించాలి, ఏమి దానం చేయాలి అన్న విషయాలు తెలుసుకొండి.
ఈ నెల 17 తేదీన జరిగే చంద్రగ్రహణం ఏ రాశి మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈనెల 17వ తేదీ తొలి ఘడియలలో అంటే మంగళవారం రాత్రి తెల్లవారుజామున 01:31 నుండి 04:30 నిమిషాల వరకు అంటే మొత్తం 02:59 నిమిషాలు కేతుగ్రస్థ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది ఉత్తరాషాడ నక్షత్రం లో ధనస్సు మరియు మకర రాశిలో సంభవిస్తుంది. గ్రహణ కాలం 1:31 ప్రారంభమై మధ్యకాలం అర్ధరాత్రి 3 గంటలకు మరియు మోక్షకాలం తెల్లవారుజామున 04:30 నిమిషాలకు అవుతుంది. ఈ గ్రహణం తృతీయ యామము ప్రారంభమవుతుంది కాబట్టి పూజలు, వ్రతములు, శ్రాద్దములు, అలాగే నిత్య భోజనాలు మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేసుకోవాలి. అశక్తులు, అంటే చిన్నపిల్లలు, గర్భిణులు, రోగగ్రస్తులు, మరియు వృద్ధులు గ్రహణ వేధ సమయము నుండి అర్ధయామము విడిచిపెట్టి అంటే రాత్రి తొమ్మిది గంటల లోపు మంగళవారం రాత్రి 9 గంటల లోపు భోజనాలు పూర్తి చేయాలి. ఈ గ్రహణం పూర్తయిన వెంటనే దక్షిణాయణం ప్రారంభమవటం విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ఇది చాలా అరుదుగా సంభవించే సంఘటన.
ఈ గ్రహణం ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అలాగే ఏ రాశి వారు చూడొచ్చు ఏ రాశి వారు చూడకూడదు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి. ఈ రాశి వారికి గ్రహణం వారి రాశి నుంచి 9 మరియు పదవ రాశి లో వస్తుంది కాబట్టి వారు గ్రహణాన్ని ని చూడవచ్చు అలాగే ప్రత్యేకించి ఏ రకమైన నియమాలు పాటించటం అవసరం లేదు. నదీతీరంలో లో నివసించేవారు నదీ స్నానం చేయటం లేదా గ్రహణానంతరం దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
వృషభ రాశి. ఈ రాశి వారికి 8 మరియు తొమ్మిదవ రాశుల్లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడక పోవడమే మంచిది. అలాగే గ్రహణం పూర్తయ్యాక బుధవారం పొద్దున స్నానం చేసి ఒక గిన్నెలో నెయ్యి పోసి దాంట్లో వెండితో చేసిన ఒక పాము ప్రతిమ మరియు చంద్రుడు ప్రతిమను వేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ నదీతీరంలో గాని సంకల్ప పూర్వకంగా బ్రాహ్మణోత్తములకు దానం చేయాలి.
మిథున రాశి వారికి ఈ గ్రహణం 8, 9 రాశుల్లో సంభవిస్తుంది కాబట్టి మీరు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం అయ్యాక బుధవారం పొద్దున గ్రహణ స్నానం చేసి పైన చెప్పిన విధంగా దానం చేయాలి.
కర్కాటక రాశి. ఈ రాశి వారికి 6, 7 రాశుల్లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
సింహ రాశి ఈ రాశి వారికి గ్రహణం 5, 6 రాసులలో సంభవిస్తుంది కాబట్టి ప్రత్యేకించి ఏ నియమాలు పూజలు పాటించనవసరం లేదు. బుధవారం తెల్లవారు దగ్గర ఉన్న నదిలో స్నానం చేయడం మంచిది లేదా దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
కన్య రాశి ఈ రాశి వారికి 4, 5 రాశుల్లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రాశి వారు గ్రహణం చూడకపోవడం మంచిది అలాగే గ్రహం పూర్తయ్యాక బుధవారం పొద్దున పైన చెప్పిన విధంగా స్నానదానాదులు పూర్తి చేయాలి.
తులారాశి ఈ రాశి వారికి మూడు, నాలుగు స్థానాల్లో గ్రహం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణం చూడకపోవడం మంచిది అలాగే గ్రహణానంతరం పైన చెప్పిన విధంగా స్నానదానాదులు పూర్తి చేయాలి.
వృశ్చిక రాశి ఈ రాశి వారికి రెండు మూడు స్థానాల్లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణాన్ని చూడవచ్చు అలాగే గ్రహణ విషయంగా ప్రత్యేక నియమాలు పాటించటం అవసరం లేదు. వీలైన వారు నదీ స్నానం చేయటం లేదా దైవదర్శనం చేసుకోవడం మంచిది.
ధను రాశి ఈ రాశి వారికి ఒకటి, రెండు స్థానాల్లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీరు గ్రహణం చూడకపోవటం మంచిది. ఇది అలాగే పైన చెప్పిన విధంగా గ్రహణం అయ్యాక బుధవారం రోజు స్నానదానాదులు పూర్తి చేసుకొని దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
మకర రాశి ఈ రాశి వారికి 12 లో మరియు ఒకటవ స్థానం లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి మీరు గ్రహణం చూడకపోవడం మంచిది అలాగే పైన చెప్పిన విధంగా గ్రహణ స్నానాదులు దానాదులు పూర్తి చేయడం వలన గ్రహణం కారణంగా ఏర్పడే చెడు ఫలితాల నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభరాశి ఈ రాశి వారికి 11, 12 స్థానాల్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు కూడా గ్రహణం చూడకపోవడం మంచిది. అలాగే గ్రహణానంతరం బుధవారం పొద్దున గ్రహణ స్నానం చేసి పైన చెప్పిన దానము ఇవ్వటం అలాగే దైవ దర్శనం చేసుకోవడం మంచిది.
మీన రాశి వారికి 10, 11 స్థానాల్లో గ్రహణం సంభవిస్తుంది కాబట్టి గ్రహణం చూడవచ్చు. ఏ రకమైన నియమాలు పాటించనవసరం లేదు.
చంద్రుడు మనస్సుకు కారకుడు అలాగే కేతువు మనలోని భయాలకు ఆత్మన్యూనతకు మరియు అసహాయతకు కారకుడు. ఈ గ్రహణం కారణంగా జరిగే చంద్ర కేతు సంయోగం వలన వృషభ మిథున కన్య తుల ధన మకర మరియు కుంభ రాశుల వారికి మానసిక ఆందోళన పెరగటం ఖర్చులు పెరగడం అలాగే లేని విషయాలను ఉంచుకొని భయపడడం మరియు బంధువులతో, మిత్రులతో వైరం ఏర్పడటం కాని లేదా మీ గురించి తప్పు విషయాలు ప్రచారం జరగడం గాని ఈ గ్రహణం కారణంగా రాబోయే రోజుల్లో అంటే ఈ డిసెంబర్ వరకు ఫలితాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు శివారాధన చేయడం అలాగే మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చాలా వరకు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. ఈ గ్రహణం వలన ఏర్పడే ఫలితాలు కూడా నామమాత్రంగానే ఉంటాయి కాబట్టి దీని గురించి ఎక్కువగా ఊహించుకొని బాధ పడే అవసరంలేదు.
గ్రహణాల విషయంలో అనవసరంగా భయపడటం తగదు. మీ రాశిలో గ్రహణం వచ్చినంత మాత్రాన మీకు అంతా చెడే జరుగుతుంది అని భావించే అవసరం లేదు. ఏ గ్రహణ ప్రభావం అయినా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మన జాతకంలో లేని ఫలితాలేవి గ్రహణాల కారణంగా రావు. గ్రహణం ఖగోళ అద్భుతం అదే సమయంలో ప్రస్తుత సైన్స్ నిరూపించలేనంత మాత్రాన గ్రహణ సమయంలో భోజనం చేయక పోవటం లేదా గ్రహణం చూడక పోవటం మొదలైనవి మూఢ విశ్వాసం కాదు. జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి గర్భిణీ స్త్రీలు పనికట్టుకొని గ్రహణం చూడటం వలన పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశముంటుంది. శాస్త్రం పని మంచి, చెడు చెప్పటం వరకే. ఏదైనా చేయడం చేయక పోవటం అనేది వ్యక్తిగత విషయం.