చంద్రగ్రహణం
చంద్రగ్రహణం - సమయం, ఏ రాశి వారికి ఏ ఫలితం ఉంటుంది.
ఈ నెల 27/28 వ తెదీల్లో (27 రాత్రి నుంచి 28 తెల్లవారుఝాము మధ్యకాలం) ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు, మకర రాశిలో ఉత్తరాషాఢా, శ్రవణా నక్షత్రాల్లో కేతుగ్రస్థ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతున్నది. దాదాపు రెండు గంటలుండే ఈ గ్రహణం, ఈ శతాబ్ధంలో అత్యధిక వ్యవధికల గ్రహణాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది.
ఈ గ్రహణము మనదేశంలో కనిపిస్తుంది. ఉత్తరభారత దేశంలో మరింత స్ఫష్టంగా దీనిని చూడవచ్చు. మన దేశంలో ఇది కనిపిస్తుంది కాబట్టి శాస్త్రరీత్యా చెప్పబడిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. గ్రహణం కారణంగా ఈ రోజున పూజాదికాల విషయంలో, భోజనాల విషయంలో, శ్రాద్ధాదుల విషయంలో మన హైందవ సంప్రదాయా రీత్యా కొన్ని నియమాలు, నిషేధాలు చెప్పబడ్డాయి.
ముందుగా గ్రహణ సమయాన్ని పరిశీలిద్దాం.
మన భారతీయ కాలమాణం ప్రకారం ఈ చంద్రగ్రహణం 27వ తేదీ రాత్రి 11 గంటల 54 నిమిషాలకు ప్రారంభమయ్యి, 28వ తేది తెల్లవారుఝామున 3 గంటల 49 నిమిషాలకు ముగుస్తుంది.
గ్రహణ స్పర్షకాలం అంటే గ్రహణం ప్రారంభం అయ్యే సమయం
జులై 27, 2018, శుక్రవారం రాత్రి 11గం 54ని 29 సెకండ్లు.
గ్రహణ మధ్యకాలం
జులై 28, 2018 శనివారం తెల్లవారుఝామున 01గం. 51ని. 45సె.
గ్రహణ మోక్షకాలం అంటే గ్రహణం పూర్తయ్యే సమయం
జులై 28, 2019 శనివారం తెల్లవారుఝామున 03 గం. 49 ని. 02సె.
గ్రహణ వేధ
ఏ గ్రహణానికి అయినా అది ప్రారంభమయ్యే సమయానికి కొంత ముందు నుంచి వేధ ప్రారంభమవుతుంది. ఇది గ్రహణం పూర్తయ్యే వరకు ఉంటుంది. మన ధర్మశాస్త్రకారులు ఈ వేధ సమయంలో భోజనాదుల విషయంలో నిషేధం విధించారు. ఆరోగ్య రీత్యా ఈ సమయం భోజనాదులకు అంతగా అనుకూలం కాదన్న కారణంగా వారు ఈ నిషేధం విధించారు అని చెప్పవచ్చు. ఈ వేధ సూర్య గ్రహణానికి ముందు 4 ప్రహరలు అంటే 12 గంటల సమయం, చంద్ర గ్రహణానికి 3 ప్రహరలు అంటే తొమ్మిది గంటల ముందు నుంచి ప్రారంభం అవుతుంది.
ఈ సారి చంద్రగ్రహణం రాత్రి 11 గంటల 54 నిమిషాలకు ప్రారంభం అవుతుంది కాబట్టి దానికి 3 ప్రహరల ముందు అంటే గ్రహణానికి 9 గంటల ముందు నుంచి అంటే మధ్యాహ్నం 2 గం.ల 54నిల నుంచి భోజనాదులు నిషిద్ధం అని అర్థం. కాబట్టి మధ్యాహ్నం 2.54 లోపు నిత్య భోజనాదులు పూర్తి చేసుకోవాలి. అశక్తులు, అనారోగ్య పీడితులు సాయంత్రం 6 లోపు భోజనం పూర్తి చేయాలి.
ఈ చంద్రగ్రహణం మకర రాశిలో ఉత్తరాషాఢా, శ్రవణా నక్షత్రాల్లో వస్తోంది. కాబట్టి మకర రాశిలో జన్మించిన వారు అలాగే మిథునరాశివారికి ఇది అష్టమ రాశి కాబట్టి వారు, తులా రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో వస్తోంది కాబట్టి ఆ రాశిలో పుట్టిన వారు, కుంభ రాశి వారికి వ్యయ స్థానంలో ఈ చంద్ర గ్రహణం ఏర్పడుతున్నది కాబట్టి ఆ రాశి జాతకులు ఈ గ్రహణం చూడక పోవటం మంచిది.
మిగతా రాశుల వారు గ్రహణం చూడవచ్చు.
మకర. మిథున, తులా మరియు కుంభ రాశి జాతకులు గ్రహణం పూర్తయ్యాక, సంకల్ప పూర్వకంగా గ్రహణ స్నానం చేసి, గ్రహణ దానం చేయటం మంచిది.
గ్రహణాల విషయంలో అనవసరంగా భయపడటం తగదు. మీ రాశిలో గ్రహణం వచ్చినంత మాత్రాన మీకు అంతా చెడే జరుగుతుంది అని భావించే అవసరం లేదు. ఏ గ్రహణ ప్రభావం అయినా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. మన జాతకంలో లేని ఫలితాలేవి గ్రహణాల కారణంగా రావు. గ్రహణం ఖగోళ అద్భుతం అదే సమయంలో ప్రస్తుత సైన్స్ నిరూపించలేనంత మాత్రాన గ్రహణ సమయంలో భోజనం చేయక పోవటం లేదా గ్రహణం చూడక పోవటం మొదలైనవి మూఢ విశ్వాసం కాదు. జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి గర్భిణీ స్త్రీలు పనికట్టుకొని గ్రహణం చూడటం వలన పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు వచ్చే అవకాశముంటుంది. శాస్త్రం పని మంచి, చెడు చెప్పటం వరకే. ఏదైనా చేయడం చేయక పోవటం అనేది వ్యక్తిగత విషయం.