శకునాలు - ఎలా చూడాలి
జ్యోతిష శాస్త్రంలో ఒక భాగమైన శకున శాస్త్రంలో ఉన్న అపోహలు తొలగించి, శకునాల గురించి ఒక అవగాహన రావటం కొరకు ఈ వ్యాసం రాయబడింది. శకునం ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు పాటించే అవసరం లేదు, ఏది శకునం, ఏది శకునం కాదు అనే విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుస్తాయి.
జ్యోతిష శాస్త్రంలో శకునాలు అతి ముఖ్యమైన విభాగం. శకునాలను హిందీలో "शकुन" (Shakun) అని మరియు ఇంగ్లీష్‌లో "Omens" అని అంటారు. ఫలితాన్ని చెప్పటానికి జన్మకుండలి ఎంత ముఖ్యమో శకునాలను గమనించటం కూడా అంతే ముఖ్యం. ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధాన్ని గమనించిన మన పూర్వికులు ఈ శకున శాస్త్రాన్ని అభివృద్ధి పరిచారు. దీని ద్వారా ఒక పని తలపెట్టినప్పుడు ఏర్పడ్డ శకునాన్ని బట్టి పని అవుతుందా కాదా లేక ఎటువంటి ఫలితం వస్తుంది అనేది అంచనా వేయవచ్చు. బల్లి శకునం, కాకి శకునం, పిల్లి శకునం ఇలా చాలా ఉన్నాయి. ప్రతి దానికి ఒక విశేషతా, ప్రాధాన్యత ఉన్నది. దీన్ని చాల మంది తేలికగా తీసుకుంటారు, కానీ అనుభవానికి వచ్చినప్పుడే అసలు విషయం బోధపడుతుంది. శకునాలను గురించి ప్రతి పంచాంగంలో ఇస్తారు అయితే చాలా మంది శకునం గురించి సరైన అవగాహన లేక ప్రతిది శకునంగానే భావిస్తారు. ఉదాహరణకి బల్లి శకునాన్ని గనక తీసుకుంటే, బల్లి శరీరం మీద పడితే, అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది. అయితే అది అసంకల్పితంగా జరిగినప్పుడే ఫలితం వస్తుంది కానీ, బల్లి ఉండే చోట కూర్చొని అది మనపై పడితే దాన్ని శకునంగా భావించే అవసరం లేదు. అలాగే పిల్లి అడ్డు రావటం కూడా, ఇంట్లో ఉండే పెంపుడు పిల్లి అడ్డు రావటం శకునం కాదు.
శకునం అనేది అసంకల్పితంగా జరిగినప్పుడే ఫలితం ఇస్తుంది తప్ప మనం ప్రేరేపించి జరిగేలా చూస్తే అది శకునం కాదు. దాని వలన ఏ ఫలితము రాదు. ముఖ్యంగా శకునాలు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు జరిగినా లేక ఏదైనా ముఖ్యమైన ప్రయాణానికి బయల్దేరే ముందు జరిగినా దాన్ని పట్టించుకోవాలి తప్పితే రోజువారి కార్యక్రమాలకు శకునాన్ని పాటించే అవసరం లేదు. పాటించినా ఫలితం ఉండదు.